మహిళల భద్రతపై అవగాహన కలిగి ఉండాలి షీ టీమ్ ఆర్ఎస్సై స్వాతి
హనుమకొండ: మహిళల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ షీ టీమ్ ఆర్ఎస్సై స్వాతి సూచించారు. నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని, అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.
హనుమకొండలోని ఎంజీఎస్ బాలికల వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్సై స్వాతి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలు, వివరాలను పంచుకునే విషయంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని, దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఉద్యోగాలు చేసే మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు, ఆకతాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని తెలిపారు.
మహిళలపై ఎవరైనా అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్‌కు సంబంధించిన వాట్సాప్ నంబర్లకు ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, నేరస్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఆర్ఎస్సై స్వాతి, హెడ్ కానిస్టేబుల్ బి. సూర్యనారాయణ, మహిళా కానిస్టేబుల్ వి. పూర్ణ పాల్గొన్నారు.