🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 04 Oct, 2026 | Page: 1

వరంగల్ జిల్లాలో బార్ బంద్‌కు మద్దతు..

ప్రివిలేజ్ ఫీజు పెంపుపై వ్యతిరేకత
వరంగల్, అక్టోబర్ 4: తెలంగాణ ప్రభుత్వం బార్లపై ప్రివిలేజ్ ఫీజును 10 శాతం నుంచి 16 శాతం వరకు పెంచే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన బంద్ పిలుపుకు వరంగల్ జిల్లా బార్ ఓనర్స్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, బార్ యజమానులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రివిలేజ్ ఫీజు పెంపు వల్ల ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న బార్లపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాపుల్లో ఏర్పాటు చేస్తున్న పర్మిట్ రూములు, బార్ల సమీపంలో కొనసాగుతున్న బెల్ట్ షాపుల కారణంగా బార్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 90 శాతం బార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కొద్దిపాటి లాభాల్లో ఉన్న పెద్ద బార్లు, పబ్బులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మొత్తం బార్ పరిశ్రమపై ప్రివిలేజ్ ఫీజు పెంచడం సరికాదని అన్నారు. ఫీజు పెంపు అమలైతే నష్టాల్లో ఉన్న బార్లు మరింత ఇబ్బందుల్లోకి వెళ్లి, శాశ్వతంగా మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై క్షేత్రస్థాయిలోని పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బార్ యజమానులు డిమాండ్ చేశారు. ప్రివిలేజ్ ఫీజు పెంపు నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు కొనసాగితే తెలంగాణలో బార్ వ్యాపారాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు రేపు వరంగల్ జిల్లాలోని బార్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తెలిపారు.
🏠 Home