భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి?
అవగాహన లోపంతో విడిపోతున్న కుటుంబాలు... మాటలతో పరిష్కరించుకోలేని సమస్యలే విషాదాలకు దారితీస్తున్నాయా?
ఒకప్పుడు కుటుంబం అంటే అనుబంధం.. ఆప్యాయత.. పరస్పర గౌరవం.. ఒకరి కోసం ఒకరు నిలబడే మనస్తత్వం. కష్టాలు వచ్చినా కలిసి ఎదుర్కొని, సమస్యలను చర్చించుకుని, జీవిత ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించే దంపతులు ఉండేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు కుటుంబ వ్యవస్థలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు.. అవగాహన లోపం.. అనుమానాలు.. మాటలతో పరిష్కరించుకోలేని సమస్యలు.. చివరకు కుటుంబ కలహాలుగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వివాదాలు విడాకులు, కుటుంబ విచ్ఛిన్నం వరకు వెళ్తుండగా.. మరికొన్ని విషాదకర పరిస్థితుల్లో హత్యలు, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి.
అందం కాదు.. అనుబంధమే ముఖ్యం
భార్య ఎంత అందంగా ఉన్నా, భర్త ఎంత మంచి వ్యక్తి అయినా.. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన లేకపోతే ఆ బంధం బలహీనపడుతుంది. అదే సమయంలో జీవిత భాగస్వామి తన కోసం, తన కుటుంబం కోసం పడుతున్న కష్టాలను గుర్తించకపోవడం కూడా దూరాన్ని పెంచుతుంది.
భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఎవరు తప్పు అనే దానికంటే.. సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిపై దృష్టి పెట్టాలి.
మనసులో మాట దాచుకుంటే.. సమస్య పెద్దదవుతుంది
భార్యాభర్తల మధ్య అనుమానాలకు ప్రధాన కారణాల్లో ఒకటి సరైన సంభాషణ లేకపోవడం. ఏదైనా విషయం అనుమానంగా అనిపిస్తే మనసులో పెట్టుకుని బాధపడటం, నేరుగా మాట్లాడకుండా ఊహించుకోవడం, ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయి.
అనుమానం వచ్చినప్పుడు నేరుగా ప్రశ్నించాలి.. సమాధానం వినాలి.. వివరణ అర్థం చేసుకోవాలి.
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
సైడ్ ట్రాక్‌లోకి వెళ్లే బంధాలు.. కుటుంబాలకు పెరుగుతున్న దూరం
దాంపత్య బంధంలో జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం, బయట సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం, కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టడం వంటి పరిణామాలు కూడా కుటుంబాల్లో కలతలకు కారణమవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అసలు సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కార మార్గం వెతకడం అవసరం.
ఒకరి తప్పును మరొకరు దాచడం కాదు.. ఒకరి సమస్యను మరొకరు అర్థం చేసుకోవడమే నిజమైన దాంపత్యం.
పాతతరం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి?
గతంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా పెద్దలు, కుటుంబ సభ్యులు మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసేవారు. చిన్న చిన్న విషయాలను జీవితాంతం మోసుకెళ్లకుండా, ఒకరినొకరు క్షమించుకుని ముందుకు సాగేవారు.
ప్రతి విషయం భరించాల్సిందే అనే అర్థం కాదు. కానీ సమస్య వచ్చిన ప్రతిసారీ బంధాన్ని తెంచుకోవడమే పరిష్కారం కాదు. ముందుగా మాట్లాడుకోవాలి.. అర్థం చేసుకోవాలి.. అవసరమైతే కుటుంబ పెద్దలు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి.
దాంపత్య బంధానికి పునాది.. సంభాషణ
భార్యాభర్తల మధ్య రోజుకు కొంత సమయం అయినా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం ఎంతో అవసరం.
“నీకు ఏమైంది?” అని అడగడం.. “నాకు ఈ విషయం బాధ కలిగించింది” అని చెప్పడం.. ఎదుటివారి మాట పూర్తిగా వినడం.. ఇవే ఎన్నో కుటుంబ సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించగలవు.
మనసులో మాట దాచుకుని కోపాన్ని పెంచుకుంటే చిన్న సమస్య కూడా పెద్దదవుతుంది. అనుమానం పెరిగితే ప్రేమ తగ్గుతుంది. మాటలు ఆగిపోతే దూరం పెరుగుతుంది.
కుటుంబాన్ని కాపాడేది ప్రేమ మాత్రమే కాదు.. పరస్పర గౌరవం
భార్యాభర్తల బంధం కేవలం కలిసి జీవించడం కాదు. ఒకరి కష్టాన్ని మరొకరు గుర్తించడం.. ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించడం.. కష్టకాలంలో అండగా నిలవడం.. తప్పులు జరిగినప్పుడు మాట్లాడుకుని సరిదిద్దుకోవడం.. ఇదే నిజమైన దాంపత్య బంధం.
కుటుంబంలో సమస్యలు రావడం సహజం.. కానీ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటామన్నదే కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
అందుకే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోకుండా.. మనసులో బాధను దాచుకోకుండా.. నేరుగా, ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవాలి. తీవ్రమైన వివాదాలు లేదా హింసాత్మక పరిస్థితులు ఉంటే నిపుణుల సహాయం తీసుకోవాలి.
చివరగా ఒక్క మాట..
భార్యాభర్తలు ఒకరినొకరు మార్చుకోవాలని ప్రయత్నించకండి.. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
మాట్లాడే కుటుంబంలో సమస్యలకు పరిష్కారం ఉంటుంది.
వినే మనసున్న దంపతుల మధ్య బంధం బలపడుతుంది.
అనుమానాల కంటే నమ్మకం.. కోపం కంటే సంభాషణ.. అహంకారం కంటే పరస్పర గౌరవం.. కుటుంబాన్ని నిలబెడతాయి.
కుటుంబం విడిపోవడానికి ముందు ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందాం..
బంధం తెగిపోవడానికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం..
వ్యాసం
Jn news
జాతీయ మీడియా ప్రతినిధి.
మునిగంటి అమరేంద్ర చారి