గోపాలస్వామి గుడి జంక్షన్లో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్! ప్రమాదాలకు నిలయంగా మూలమలుపు.. పట్టించుకోని వైన్స్ యాజమాన్యం.. చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ!
వరంగల్, కొత్తవాడ: గోపాలస్వామి గుడి జంక్షన్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయం ఎదురుగా, శ్రీ వెంకటేశ్వర తెలంగాణ వైన్స్ ముందు విచ్చలవిడిగా వాహనాలు పార్కింగ్ చేయడం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మూలమలుపు వద్ద వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆటోనగర్, కొత్తవాడ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, కళాశాలలు, ఆసుపత్రులు ఉండటంతో ఈ మార్గంలో విద్యార్థులు, రోగులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో పరిమిట్ రూమ్‌తో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర తెలంగాణ వైన్స్ వద్ద వాహనాల పార్కింగ్ సమస్య మరింత తీవ్రంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.
వైన్స్‌కు వచ్చే కొందరు మద్యం సేవించిన అనంతరం గొడవలకు దిగుతున్నారని, ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ వైన్స్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవడం లేదని, పోలీస్ శాఖ కూడా సమస్యపై తక్షణమే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ శాఖ స్పందించాలి
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత పోలీసు అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. మూలమలుపు వద్ద వాహనాల పార్కింగ్‌ను నియంత్రించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే వైన్స్ నిర్వహణ నిబంధనలు, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై సంబంధిత అధికారులు పరిశీలన చేపట్టాలని కోరుతున్నారు.
వైన్స్‌ను ఇక్కడి నుంచి తరలించాలి
ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతకు, విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం కాని పక్షంలో శ్రీ వెంకటేశ్వర తెలంగాణ వైన్స్‌ను ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు కోరుతున్నారు.