పోలీస్ అమరవీరుడు భీమ్ సింగ్ జ్ఞాపకార్థం 12 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
తాడ్వాయి: పోలీస్ అమరవీరుడు భూక్య భీమ్ సింగ్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 గ్రామ పంచాయతీలకు చెందిన ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి చొప్పున మొత్తం 12 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
భూక్య భీమ్ సింగ్ 1994 నుంచి 1996 వరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ఉండగా, 1996 సెప్టెంబర్ 23న మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఆయన, మరుసటి రోజు సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచి పోలీస్ అమరవీరుడిగా నిలిచారు.
తన తండ్రి చివరిగా విధులు నిర్వహించిన తాడ్వాయి ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన కుమారుడు, మై హోమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు భూక్య రాజేష్, కోడలు భూక్య రోజీ క్రిస్టినా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 21న తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పోలీసుల సమక్షంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భూక్య రాజేష్, భూక్య రోజీ క్రిస్టినా మాట్లాడుతూ, తమ తండ్రి చివరిగా విధులు నిర్వహించిన ప్రాంత ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం నిరుపేద కుటుంబాలకు సహాయం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తాడ్వాయి పోలీసులకు, ఇతర సహకారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.