🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Aug, 2026 | Page: 1

ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్


బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ అమాయక ప్రజలకు వల.. తెలంగాణలో 22 సైబర్ కేసులతో లింకులు

న్యూఢిల్లీ: అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ మోసపూరిత కాల్ సెంటర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసి 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్ ప్రాంతంలో మూడు నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఉత్తరాదికి చెందిన లలిత్ సింగ్, కులదీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కాల్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ మోసం

కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న టెలికాలర్లు బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా ప్రజలను నమ్మించేవారు. ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఫోన్ చేసి వివిధ రకాల ఛార్జీలు, ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు.

ఈ విధంగా అనేక మంది అమాయక ప్రజలను మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తెలంగాణలో 22 సైబర్ కేసులతో లింకులు

తెలంగాణలో నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసుల్లో ఈ కాల్ సెంటర్లకు సంబంధం ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కేసుల దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వివిధ జిల్లాలకు చెందిన మహిళా టెలికాలర్లు

అరెస్టైన 21 మంది మహిళా టెలికాలర్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

కాల్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మోసాలకు సంబంధించి మరిన్ని వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరిస్తున్నారు.
🏠 Home