మత సామరస్యానికి ప్రతీక కాజీపేట దర్గా..వచ్చే ఉర్సు నాటికి మౌలిక వసతుల అభివృద్ధి పూర్తి చేస్తాం- మంత్రి పొంగులేటి
కులమత భేదాలకు అతీతంగా సర్వమతాల ప్రజలు ఐక్యంగా పాల్గొనే కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి, ఉర్సు ఉత్సవాల ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కాజీపేట దర్గాలో జరిగిన ఉర్సు వేడుకల్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ఉర్సులో పాల్గొనడం గొప్ప విషయమన్నారు.కాజీపేట దర్గాలో కనిపిస్తున్న సర్వమత ఐక్యత తనను ఎంతో సంతోషపరిచిందన్నారు. ఉర్సును ఘనంగా నిర్వహిస్తున్న దర్గా పీఠాధిపతి కుసూర్ పాషా సాహెబ్, నిర్వాహకులను అభినందించారు.దర్గా అభివృద్ధికి సంబంధించి నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై స్పందించిన మంత్రి.. కలెక్టర్,మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఉర్సు నాటికి మౌలిక వసతుల పనులు పూర్తి చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రిగా తాను తీసుకుంటానని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రేమ, ఐక్యతతోనే అభివృద్ధి:అజారుద్దీన్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ దేశానికి ప్రస్తుతం ప్రేమ,ఆప్యాయత,ఐక్యత,సోదరభావం ఎంతో అవసరమన్నారు.ప్రజలంతా కలిసిమెలిసి పనిచేసినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.కాజీపేట దర్గా ఉర్సులో తెలంగాణకు ప్రతీకగా నిలిచే గంగా–జమునా తహజీబ్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ముందుగా మనుషులం.. ఆ తర్వాతే కులం, మతం: సురేఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ మత సామరస్యానికి,సోదరభావానికి ప్రతీక అన్నారు.వందల ఏళ్లుగా కాజీపేట దర్గా ఉర్సులో కులమత భేదాలు లేకుండా ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు. ముందుగా మనం మనుషులం.. ఆ తర్వాతే కులం, మతం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కులం, మతం పేరుతో విభేదాలు పెంచుకుంటే రాష్ట్ర, దేశ అభివృద్ధి కష్టమవుతుందని పేర్కొన్నారు.రూ.40 లక్షలతో తాగునీటి వసతి: నాయిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉర్సు ఏర్పాట్లను నెల రోజుల ముందుగానే సమీక్షించి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసినట్లు తెలిపారు. నీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఉర్సు సందర్భంగా భక్తుల కోసం సుమారు రూ.40 లక్షలతో తాగునీటి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే జాయరీన్లకు ఉచిత భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.దర్గా అభివృద్ధికి ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయని, అవి అమలైతే జాయరీన్లకు మరింత మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.సర్వమత ఐక్యతకు వేదికగా ఉర్సు కాజీపేట దర్గా ఉర్సు ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు సర్వమత ఐక్యత, మానవత్వం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దర్గా పీఠాధిపతి కుసూర్ పాషా సాహెబ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.