🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Aug, 2026 | Page: 1

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 25 ఏళ్ల జైలు

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి నల్గొండ జిల్లా POCSO న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాకు మొత్తం 25 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

2020 మే 30న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు, అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

కిడ్నాప్ కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, POCSO చట్టంలోని సెక్షన్ 3, 4 కింద 20 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ POCSO న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అలాగే బాధిత మైనర్ బాలికకు రూ.5 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న నల్లగొండ జిల్లా POCSO న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.

ఈ కేసులో న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తులో అప్పటి SHO డి. శ్రీనివాస్ రెడ్డి, CDO బి. అఖిల్, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితరులు సహకరించారు.

మైనర్ బాలికపై నేరానికి పాల్పడిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించడం ద్వారా బాలలపై నేరాలకు పాల్పడేవారికి చట్టపరమైన పరిణామాలు తప్పవనే సందేశం వెళ్లింది.
🏠 Home