🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Aug, 2026 | Page: 1

అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్

వరంగల్, ఆగస్టు 13: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఎన్యూమరేషన్ దశలో సేకరించబడని లేదా ‘Uncollectable’గా గుర్తించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పూర్తి వివరాలను అందించాలని కోరుతూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, BLA-1 మహమ్మద్ అయూబ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించలేదనే కారణంతో ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు కోల్పోకూడదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్‌ల వారీగా సేకరించని ఎన్యూమరేషన్ ఫారమ్‌ల జాబితా, వాటిని ‘Uncollectable’గా గుర్తించడానికి గల కారణాలు, నిబంధనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఓటర్ల సంప్రదింపు వివరాలను అందించాలని ఆయన కోరారు.
ఈ వివరాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), సమన్వయ బృందాలు క్షేత్రస్థాయిలో సంబంధిత ఓటర్లను గుర్తించి, వారికి అవగాహన కల్పించడంతో పాటు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో తమ ఓటు హక్కును పరిరక్షించుకునేలా సహకరిస్తాయని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనర్హతలు, పొరపాట్లకు తావులేకుండా పారదర్శకమైన, సమగ్ర, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని మహమ్మద్ అయూబ్ స్పష్టం చేశారు.
🏠 Home