🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 14 Aug, 2026 | Page: 1

వరి వేసుకోకండి .నష్టపోకండి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రైతులకు విజ్ఞప్తి

ఈ ఖరీఫ్ సీజన్ సమయం ముగిసినందున జిల్లాలోని రైతులు ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని, వరి వేస్తే నష్టపోవాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. వ్యవసాయ అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి రైతులు వరి వేయకుండా అవగాహన కల్పించాలన్నారు. వరి పంట వేసేందుకు పెట్టే పెట్టుబడి, నీటి లభ్యత, వర్షాలు, భూగర్భ జలాలు, కూలీల పెట్టుబడి అన్నింటిని రైతులకు వివరించి చెప్పి వరి పంట జోలికి వెళ్లకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రం శివారులో వరి సాగుకు భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు మోహన్, పరశురాం, ఖాదర్ తదితరులతో మాట్లాడారు. వరి పంటకు సాగునీటి అవకాశాలే లేవని, అలాంటప్పుడు వరి ఎందుకు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. బలవంతంగా వరి సాగు చేస్తే నష్ట పోవలసి వస్తుందని రైతులతో చెప్పారు. ఆరతడి పంటలు వేసుకుంటే నష్టం లేకుండా, ఆదాయం వస్తుందని తెలియజేస్తూ
ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు కురిసే అవకాశం లేదని, వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు వర్షాలు కురిసే అవకాశం లేనందున ప్రస్తుతం వరి వేసుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని, అంతేకాక ప్రాజెక్టుల నుండి కూడా సాగునీరు వచ్చే అవకాశం లేదని, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుండి కూడా సాగునీరు రాదని, వర్షం లేకపోవడం, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లలో నీరు తగ్గిపోయిందని తెలిపారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంట వేసుకోవద్దని, అనవసరంగా ఇబ్బందులు పడవద్దని అన్నారు. వరి పంట వేసుకున్నట్లయితే మధ్యలోనే పంట ఎండిపోతుందని, ఇదివరకే చాలా చోట్ల బోర్లలో తక్కువ నీరు వస్తున్నదని,వరి పైన పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు గిట్టుబాటు కాదని ,వరి పంట స్థానంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని, సెప్టెంబర్ చివరివరకే ఆరుతడి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రం శివారులో చౌడు భూముల్లో రైతులు వరి పంటకు సిద్ధం చేయడాన్ని గమనించిన కలెక్టర్ చౌదు భూముల్లో మినుములు, పెసర వంటి పంటలు వేసుకోవాలని, మినుము, పెసర పంటలకు పెట్టుబడి తక్కువని, ఎకరాకు 8000 చొప్పున ఆదాయం వస్తుందని, అదే వరి పంటకు పెట్టుబడి ఎక్కువని, పొరపాటున నీళ్లు లేక, వర్షం రాక పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతు అప్పుల పాలు కావాల్సి వస్తుందని అన్నారు. చవుడు భూములలో జిప్సం వేసుకున్నట్లయితే మినుము, పెసర పంటల లాంటివి సులభంగా తీసుకోవచ్చని, అంతేకాక చౌడు నెలల్లో రేగు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు కూడా వేసుకునేందుకు అవకాశం ఉందని, ఈ దిశగా రైతులు ఆలోచించి ఆరుతడి పంటలు ,ఉద్యాన పంటలు వేసుకునేలా చూడాల్సిందిగా ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు వారి పరిధిలోని ప్రతి రైతు ను ప్రత్యక్షంగా కలిసి పంట వివరాలను తెలుసుకొని వరి పంట సాగు చేయవద్దని, వరి పంట సాగు చేయడం వల్ల కలిగే నష్టాలను లెక్కలతో సహా వివరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. రైతులు యూరియా గురించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ అన్ని షాపులలో యూరియా దొరికే విధంగా అవకాశం కల్పించాలని, యాప్ ద్వారా యూరియా బుక్ చేయడం వల్ల వెంటనే స్టాకు అయిపోతున్నదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ యూరియా ఇండెంట్ పంపాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ను ఆదేశించారు.
వ్యవసాయ సహాయ సంచాలకులు విజయేందర్ రెడ్డి, సన్నీ రాజ్, గిరిరాజు ,ఏవో శ్రీనివాస్, ఏ ఈ ఓ సంతోషి, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
🏠 Home