🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 14 Aug, 2026 | Page: 1

ప్రజా ప్రభుత్వo అందించే పెన్షన్లు నిజమైన అర్హులకే దక్కాలి-పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదే పూర్తి బాధ్యత.
గ్రామ పంచాయతీల్లోనే దరఖాస్తుల స్వీకరణ.
ఈ నెల 31 నాటికి జాబితా రూపకల్పన పూర్తి కావాలి.

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి :
తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, నిజమైన అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆమె హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చూసే పూర్తి బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. ప్రజలు దరఖాస్తుల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, దరఖాస్తులను నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆదేశించారు.
పెన్షన్ల మంజూరు పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే దళారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని దివ్య దేవరాజన్ అధికారులను హెచ్చరించారు. దళారులను ఆశ్రయించి ప్రజలు నష్టపోవద్దని, నేరుగా పంచాయతీ అధికారులను సంప్రదించాలని కోరారు. ఒకవేళ ఎక్కడైనా దళారు ప్రమేయం ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
*ఈ నెల 31 నాటికి పూర్తి జాబితా సిద్ధం కావాలి*
వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు, కల్లుగీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, దివ్యాంగుల విభాగాల్లోని ప్రతి అర్హుడినీ గుర్తించి, ఈ నెల 31వ తేదీ నాటికి లబ్ధిదారుల తుది జాబితాలో చేర్చాలని ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సాంకేతిక లేదా ఇతర కారణాలతో నష్టపోకూడదని, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని ఉద్ఘాటించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లొ MPDO శంకర్, MPO శేషు, మండలం లోని వివిధ గ్రామాల సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
🏠 Home