సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్
వరంగల్, ఆగస్టు 16: పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పరకాల టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం వరంగల్ జిల్లా అభివృద్ధి, విద్యార్థులు, యువత, మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు మహమ్మద్ అయూబ్ తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మైనార్టీ విద్యార్థులు, యువతకు మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన పలువురు విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు కళాశాలలకు అందకపోవడంతో సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా వరంగల్ జిల్లాలో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు కళాక్షేత్రం ఏర్పాటు కోసం జిల్లాకు స్థలం లేదా కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు అయూబ్ తెలిపారు.ప్రజలు, విద్యార్థులు, యువత, మైనార్టీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పేర్కొన్నారు.