చేతులు, కాళ్లు కట్టేసి భర్తను హత్య చేసిన భార్య!
హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో జరిగిన గొడవ నేపథ్యంలో భార్య అతడిని చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51), ఆయన భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ చేతులు, కాళ్లను సునీత చీరతో కట్టేసి, సెంట్రింగ్ కర్రతో తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం సత్యనారాయణ వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని సునీత తన కుమారుడికి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయితే సత్యనారాయణ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సునీతను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.