రాళ్లు కాదు... రాగాలు పరుకుతున్నాయి.
మోత్కూరులో సహజసిద్ధ సంగీత శిలలు.. తట్టితే ఒక్కో రాయిది ఒక్కో స్వరం..
ఫొటోలు, వీడియోలు తీస్తున్న సందర్శకులు.. సోషల్ మీడియాలో వైరల్..
మోత్కూరు ఆగస్టు 24 (జన చరిత్ర): సాధారణంగా రాళ్లంటే నిశ్శబ్దంగానే ఉంటాయి. కానీ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కనిపిస్తున్న కొన్ని సహజసిద్ధమైన రాళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా తట్టినప్పుడు గంట మోగినట్టుగా స్పష్టమైన ధ్వని వినిపిస్తుండటంతో స్థానికులు, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో రాయిని తట్టినప్పుడు ఒక్కో రకమైన శబ్దం రావడంతో వీటిని ఆసక్తిగా పరిశీలించేందుకు పలువురు అక్కడికి చేరుకుంటున్నారు. రాళ్లను తట్టగా వచ్చే ధ్వనులకు అనుగుణంగా కొందరు లయబద్ధంగా వాయిస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరు రాళ్ల నుంచి వెలువడే శబ్దాలను తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫొటోలుగా చిత్రీకరిస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఈ సహజసిద్ధమైన రాళ్లపై ఆసక్తి మరింత పెరుగుతోంది. దీంతో రోజురోజుకూ వాటిని చూసేందుకు, రాళ్ల నుంచి వచ్చే ప్రత్యేకమైన ధ్వనులను స్వయంగా వినేందుకు సందర్శకులు వస్తున్నారు. సాధారణ రాళ్లను తట్టినప్పుడు వచ్చే శబ్దానికి భిన్నంగా వీటి నుంచి వచ్చే ధ్వని ప్రత్యేకతగా మారింది. రాయి ఆకారం, పరిమాణం, సాంద్రత, అంతర్గత నిర్మాణం వంటి భౌతిక లక్షణాల కారణంగా కొన్ని శిలలు కంపించి ప్రత్యేకమైన ధ్వనిని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి రాళ్లను ‘సంగీత శిలలు’గా పిలుస్తారు. రాళ్లను తట్టి స్వరాలను ఉత్పత్తి చేసే వాయిద్యాన్ని ‘లిథోఫోన్’గా పేర్కొంటారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాంతంలోని ‘ఏనె రాళ్లు’పై సంగీతం పలికించే రాళ్లు ఉన్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. మోత్కూరులో కనిపిస్తున్న ఈ రాళ్ల ప్రత్యేకతపై నిపుణులతో అధ్యయనం చేయిస్తే వాటి నుంచి ధ్వని ఎందుకు వస్తోంది? వాటి నిర్మాణం ఏమిటి? అనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఈ ప్రాంతాన్ని గుర్తించి రాళ్లను పరిరక్షించడంతో పాటు వాటి ప్రత్యేకతను వివరించే సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తే ఇది భవిష్యత్‌లో స్థానిక పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నరు.