🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 30 Aug, 2026 | Page: 1

గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారి కార్యాలయం ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు
దేవాదాయ శాఖ అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్ల పై సమీక్షించిన మంత్రి సురేఖ గారు
ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపిన మంత్రి
గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణ వుండాలన్న మంత్రి సురేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, సలహాల మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్దంగా పనులను చేపడుతున్నట్లు స్పష్టంచేసిన మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా దేశం నలుమూలలా తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వుండాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు తెలంగాణ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం ప్రతిబింబించేలా వసతుల కల్పన వుండాలని మంత్రి సురేఖ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ 26 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు ప్రజాభవన్ లోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ (ప్రత్యేక అధికారి) కార్యాలయాన్ని ఈ రోజు మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. కార్యాలయంలోని సెక్షన్లను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తర్వాత ప్రత్యేకాధికారి కార్యాలయంలోని నూతన కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సమీక్షా సమావశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, ఆర్జేసి రామకృష్ణారావు, డిసి కృష్ణ ప్రసాద్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలు అనగానే ఇప్పటివరకు రాజమహేంద్రవరం పేరు ప్రధానంగా వినిపించేదని, వచ్చే గోదావరి పుష్కరాల నిర్వహణతో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుని, పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం కేంద్ర బిందువుగా పనిచేస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఘాట్ల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక అధికారి కార్యాలయం కీలక సమన్వయ కేంద్రంగా పనిచేయడంతో పాటు, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
వచ్చే సంవత్సరం 26 జూన్ నుంచి 7 జూలై వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కర యాత్రగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డిగారు రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లే, గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక సమ్మక్క-సారక్క జాతరను రెండుసార్లు విజయవంతంగా చేపట్టినట్లు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను మంత్రి కొండా సురేఖ గారికి వివరించారు. గోదావరి పరిహాక ప్రాంతంలో ఎంచుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు డైరక్టర్ హనుమంతరావు మంత్రి గారికి వివరించారు. టైర్‌–1, టైర్‌–2 పరిధిలో సుమారు 2 కి.మీ మేర ఘాట్‌ల నిర్మాణ పనులు ప్రారంభించగా, మొత్తంగా టైర్ 1, 2, 3 పరిధిలో 5 కి.మీకి పైగా ఘాట్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. నిధుల వివరాల పై మంత్రి సురేఖ అధికారులను ఆరా తీయగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ శాఖలకు నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అలాగే మెడికల్, పోలీస్, టూరిజం శాఖలకు నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. దశలవారీగా టెండర్ల నిర్వహణ, నిధుల మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పలు ఘాట్ల నమూనా చిత్రాలను అధికారులు మంత్రి సురేఖ గారు పరిశీలించారు.
గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా వున్నందున గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాత ఘాట్లను పటిష్టం చేస్తూ, కొత్త ఘాట్లను మళ్ళీ వచ్చే పుష్కరాల వరకు మనగలిగేలా పటిష్టంగా నిర్మించాలని మంత్రి సురేఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.
నేపాల్ భీకర వరదల్లోనూ కొట్టుకుపోకుండా స్థిరంగా నిలిచిన ఇంటిని ప్రస్తావించిన మంత్రి
ఇటీవల నేపాల్‌లో వచ్చిన భారీ వరదల్లో చుట్టుపక్కల ఎన్నో నిర్మాణాలు కొట్టుకుపోయినా, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచిన తీరును మంత్రి సురేఖ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాణ్యతకు గొప్ప ఉదాహరణగా ఆ ఇల్లు నిలుస్తుందన్నారు. గోదావరి పుష్కరాల పనులు విషయంలో హడావుడిగా కాకుండా నాణ్యతకు, పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల కోసం చేపట్టే ప్రతి నిర్మాణాన్ని రాజీ పడకుండా నాణ్యతతో చేపట్టాలని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. పుష్కరాల కోసం చేసే ఏర్పాట్లను తాత్కాలికమైనవిగా భావించకుండా, భవిష్యత్ కార్యక్రమాలను వుపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
“గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కర ఏర్పాట్లు కూడా భవిష్యత్ తరాలు సైతం కీర్తించేలా ఉండాలి. మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, దేవాలయాల ప్రాచీన వైభవానికి మరింత వన్నె తెచ్చేలా, నాణ్యతతో కూడిన శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి” అని మంత్రి సురేఖ సూచించారు. భక్తులు స్నానాలు చేసే ఘాట్లలో నీటి ప్రవాహ ఉదృతి ఎక్కువగా వుంటే కొట్టుకుపోయే పరిస్థితులున్నందున గ్రిల్స్ ను పటిష్టంగా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు అవసరమైన సౌకర్యాలను పకడ్బందీగా చేపట్టాలని ప్రత్యేకంగా నిర్దేశించారు. అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా, సమన్వయంతో వ్యవహరిస్తూ పుష్కరాల ప్రారంభానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని మంత్రి సురేఖ దేవాదాయశాఖ డైరక్టర్ హనుమంతరావుకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రజా భవన్ కు వచ్చిన మంత్రి సురేఖ గారికి అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణతో సాదరంగా స్వాగతం పలికారు.
🏠 Home