🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 31 Aug, 2026 | Page: 1

పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే లక్ష్యం: ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇసుక అడ్డ పోర్ట్ రోడ్ ప్రాంతంలోని రాజశ్రీ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన మహా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 1,500 మంది పేద, మధ్యతరగతి ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరంలో 1,000 మందికి పైగా కంటి అద్దాలు అందించామని, కంటి రెటీనా తదితర సమస్యలతో బాధపడుతున్న సుమారు 100 మందిని తదుపరి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇది ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత ఉచిత కంటి వైద్య శిబిరమని, గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గలో నిర్వహించిన మొదటి విడత శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రదీప్ రావు సూచించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య పరీక్షలు చేయించుకోలేని పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడం, తదుపరి చికిత్సకు వైద్యుల సూచనలు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమన్నారు. శిబిరానికి విశేష స్పందన అందించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజా సేవే లక్ష్యంగా.. ఆరోగ్యమే మహాభాగ్యంగా..” భవిష్యత్తులోనూ మరిన్ని ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలుస్తామని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.
శిబిరానికి సహకరించిన శంకర్ కంటి ఆసుపత్రి సిబ్బందికి, క్రీడో లైఫ్ సైన్స్ డైరెక్టర్ ఆలూరు వంశీకృష్ణకు ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్, నర్సంపేట నియోజకవర్గ కంటెస్టెడ్ అభ్యర్థి పుల్లారావు, బీజేపీ కార్పొరేటర్లు దాస్యం అభినవ్ భాస్కర్, గుజ్జుల వసంత మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక కార్యక్రమ నిర్వాహకులు, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🏠 Home