సంస్థాన్ నారాయణపురం లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలో నేడు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైయస్సార్ తెలుగు వారికి దూరమై 17 సంవత్సరాలు గడిచినా నేటికీ వారు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కనుల ముందు కదలాడుతున్నాయని అన్నారు , ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో వైయస్సార్ కు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ,జలయజ్ఞం లాంటి జనాకర్షక పథకాలతో సుపరిపాలన అందించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, వైయస్సార్ స్ఫూర్తితో, వారి ఆశయ సాధన కోసం గ్రామ అభివృద్ధిలో మా వంతు కృషి చేస్తామని పలువురు నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్యానాయక్,జిల్లా నాయకులు కత్తుల లక్ష్మయ్య, బాలకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుక్కల నరసింహ, నాగరాజు, నర్సింహా, పర్సంబోయిన యాదయ్య,రామకృష్ణ, మధు మేకల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.