🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Sep, 2026 | Page: 1

అనుమతి లేకుండా ఫ్లెక్సీల ముద్రణ, ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ముద్రించడం, ఏర్పాటు చేయడాన్ని సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ **శ్రీ బి. వంశీకృష్ణ** స్పష్టం చేశారు.

కమిషనర్ ఛాంబర్‌లో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, **మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పత్రాన్ని పరిశీలించిన అనంతరం మాత్రమే ఫ్లెక్సీలను ముద్రించాలని** సూచించారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, వ్యక్తులు లేదా ఇతర సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చినప్పటికీ ఇదే నిబంధనను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పొందిన **హోర్డింగ్స్, మీడియన్‌లో అనుమతితో ఏర్పాటు చేసిన లాలీపాప్ బోర్డులకు** మాత్రమే సంబంధిత ఫ్లెక్సీలను ముద్రించాలని, అనుమతి లేని ఫ్లెక్సీలను జంక్షన్లు, మీడియన్ పోల్స్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కూడళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్న రౌండ్ ఫ్లెక్సీల వల్ల వాహనదారులకు దృశ్యమానత తగ్గి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతున్న నేపథ్యంలో రహదారి భద్రతకు విఘాతం కలిగించే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా, లేదా అనుమతి లేని ఫ్లెక్సీని ముద్రించినా **సంబంధిత వ్యక్తితో పాటు ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపు యజమానిపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని** కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నగర సౌందర్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ **శ్రీమతి కృష్ణవేణి**, నల్గొండ నగరంలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home