🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 09 Sep, 2026 | Page: 1

శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ దుర్మార్గం: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల మొత్తం సెషన్ కాలానికి సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై సభలో గళం విప్పకుండా, ప్రతిపక్షాల నోరు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన అప్రజాస్వామిక నిర్ణయానికి ఒడిగట్టిందని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి దేవాలయాల వంటి శాసనసభల్లో ప్రజాప్రతినిధులకు మాట్లాడే హక్కును కాలరాయడం దారుణమన్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్ నేతలను సభ నుంచి బహిష్కరించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపబోదని, ప్రజల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. సస్పెన్షన్ వేటు పడిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు నల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు భూపాల్ రెడ్డి గారు పేర్కొన్నారు.
🏠 Home