ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..వ్యక్తి అరెస్ట్ రూ.85 లక్షల నగదు,4 తులాల బంగారం వసూలు..నకిలీ నియామక ఉత్తర్వులతో బురిడీ
కాజీపేట: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగ యువత నుంచి భారీగా నగదు,బంగారం,అసలు విద్యా సర్టిఫికెట్లు వసూలు చేసిన వ్యక్తిని కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన మెట్టు ప్రవీణ్‌కుమార్(41)ను నిందితుడిగా గుర్తించారు.ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్,ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అభ్యర్థులను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.స్పోర్ట్స్ కోటా,ఎన్‌సీసీ కోటా,బ్యాక్‌డోర్ రిక్రూట్‌మెంట్ పేరుతో అభ్యర్థులను ఆకర్షించిన నిందితుడు..గతంలో జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పేర్లు మార్చి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు,మెమోరాండాలు తయారు చేసి చూపించినట్లు వెల్లడించారు.మోసం నమ్మదగినదిగా కనిపించేలా మెడికల్ టెస్టులు,పోలీస్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు నిర్వహించినట్లు నటించడంతో పాటు..ఐసీఏఐలో నిర్వహించే ఓరియంటేషన్,ఐటీ కోర్సులను ప్రభుత్వ ఉద్యోగ శిక్షణగా నమ్మించి యువతను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.ఇప్పటివరకు గుర్తించిన బాధితుల నుంచి సుమారు రూ.85 లక్షల నగదు,4 తులాల బంగారం వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.వారి అసలు విద్యా సర్టిఫికెట్లు,ఉద్యోగ సంబంధిత పత్రాలను కూడా తీసుకున్నట్లు తెలిపారు.రూ.18.22 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం నిందితుడి వద్ద నుంచి నగదు,కారు,ల్యాప్‌టాప్,సెల్‌ఫోన్లు,బాధితుల అసలు విద్యా సర్టిఫికెట్లు,ఉద్యోగ సంబంధిత పత్రాలు,నకిలీ నియామక ఉత్తర్వులు తయారు చేసేందుకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాజీపేట ఏసీపీ పి.ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు,సీఐ జే.శ్యామ్‌సుందర్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ మోసంలో మరింత మంది బాధితులు ఉన్నారా?మరెవరైనా ప్రమేయం ఉందా?అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఉద్యోగాల పేరుతో డబ్బులు ఇస్తే అప్రమత్తంగా ఉండాలి బ్యాక్‌డోర్ రిక్రూట్‌మెంట్,ప్రత్యేక కోటా లేదా అధికారులతో పరిచయాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు సూచించారు.నియామక ప్రక్రియ,నోటిఫికేషన్లు,ఫలితాలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే ధృవీకరించుకోవాలని తెలిపారు.“ప్రభుత్వ ఉద్యోగానికి షార్ట్‌కట్ లేదు..ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వారిని నమ్మవద్దు”అని కాజీపేట పోలీసులు సూచించారు.