🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 09 Sep, 2026 | Page: 1

దళిత–బహుజనులను మోసం చేసిన కాంగ్రెస్, BRS, BJPలకు ప్రజలే బుద్ధి చెప్పాలి భువనగిరి పార్లమెంట్ BSP ఇంచార్జ్ కత్తుల కాన్షీరామ్

భువనగిరి: దళిత–బహుజనుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కాంగ్రెస్, BRS, BJP పార్టీలకు అలవాటుగా మారిందని BSP భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ కత్తుల కాన్షీరామ్ తీవ్రంగా విమర్శించారు.

దళితులకు అన్యాయం జరిగిందని ఒక పార్టీ మరొక పార్టీపై విమర్శలు చేయడం సులభమని, కానీ దళిత–బహుజనులకు నిజమైన రాజకీయ అధికారం, సామాజిక న్యాయం కల్పించేందుకు ఈ మూడు పార్టీలు ఏం చేశాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

BRS పాలనలో దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి దళిత బంధు వరకు అనేక హామీలు ఇచ్చి, వాటి అమలులో దళిత–బహుజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దళిత–బహుజనులకు ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందో ప్రజలకు స్పష్టమైన లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న BJP కూడా దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీల ఓట్ల కోసం సామాజిక న్యాయం గురించి మాట్లాడటం కాకుండా, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, ప్రైవేటీకరణ, సామాజిక ప్రాతినిధ్యంపై తన వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు.

ఓట్ల కోసం దళితులు కావాలి… అధికారంలో భాగస్వామ్యం మాత్రం వద్దా?

ఎన్నికలు వచ్చినప్పుడల్లా దళిత–బహుజనుల ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత వారిని మరిచిపోయే రాజకీయ సంస్కృతిని అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

దళిత–బహుజనులు ఎవరి ఓటు బ్యాంకు కాదు. వారు ఈ దేశానికి పునాది వేసిన శ్రమజీవులు, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడిన ప్రజలు.

కాంగ్రెస్, BRS, BJP మూడు పార్టీలు దళిత–బహుజనుల సమస్యలను ఒకరిపై ఒకరు రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకోవడం మానేసి, దళిత–బహుజనులకు ఎంత రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చారు? ఎంత భూమి ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? రిజర్వేషన్లను ఎలా అమలు చేశారు? సంక్షేమ నిధులను ఎంత ఖర్చు చేశారు? అనే ప్రశ్నలకు ప్రజల ముందు లెక్క చెప్పాలని కత్తుల కాన్షీరామ్ డిమాండ్ చేశారు.

దళితుల పేరుతో ఓట్లు అడిగి, అధికారాన్ని మాత్రం ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉంచే రాజకీయాలను BSP తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

BSP లక్ష్యం అధికార భాగస్వామ్యం కాదు — బహుజన రాజ్యాధికారం

బహుజనులను విడదీసి పాలించే కాంగ్రెస్, BRS, BJP రాజకీయాలకు ప్రత్యామ్నాయం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు.

“మా పోరాటం ఒక పార్టీపై కాదు… దళిత–బహుజనులను ఓటు బ్యాంకుగా చూసే మొత్తం రాజకీయ వ్యవస్థపై.
మా లక్ష్యం పదవులు కాదు… బహుజన రాజ్యాధికారం.”

దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు మరియు అణగారిన వర్గాల ప్రజలందరూ రాజకీయంగా ఏకమై, తమ ఓటును తమ రాజ్యాధికారానికి ఆయుధంగా మార్చుకోవాలని కత్తుల కాన్షీరామ్ పిలుపునిచ్చారు.
🏠 Home