🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

సెప్టెంబర్ 15 నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్.బి రాజారెడ్డి

తెలంగాణ వరంగల్, సెప్టెంబర్ 11

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రాజా రెడ్డి తెలిపారు.శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు,సిబ్బంది,ఆప్తాల్మిక్ అధికారులు,డైస్ ఆప్టోమెట్రిస్టులతో కంటి పరీక్షల శిబిరాలపై సంసిద్ధత సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డా.రాజా రెడ్డి మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో ఐదు ఆర్‌బీఎస్‌కే బృందాలు,ఒక్కో బృందానికి ఆప్టోమెట్రిస్ట్ లేదా ఆప్తాల్మిక్ అధికారిని అనుసంధానం చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు.వారానికి 3–4 రోజులు శిబిరాలు నిర్వహించి,ప్రతి బృందం రోజుకు 300 మంది విద్యార్థులకు పరీక్షలు చేయాలని సూచించారు.దృష్టి లోపాలు ఉన్నవారికి కంటి అద్దాల కోసం సిఫారసు చేయడంతోపాటు,ఇతర కంటి సమస్యలు గుర్తించిన విద్యార్థులను ఉన్నత వైద్యసేవల కోసం రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.పరీక్షల వివరాలతో రోజువారీ నివేదికలను జిల్లా,రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు.విద్యాశాఖ అధికారులు,ప్రధానోపాధ్యాయులు,స్థానిక వైద్యాధికారులు,ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ/ప్రోగ్రాం అధికారి(సీహెచ్‌ఐ)డా.ప్రకాష్,ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు,సిబ్బంది,ఆప్తాల్మిక్ అధికారులు,డైస్ ఆప్టోమెట్రిస్టులు పాల్గొన్నారు.
🏠 Home