తిరుపతిలో పోయిన మొబైల్..హసన్‌పర్తి పోలీసుల చొరవతో రికవరీ సీఈఐఆర్ సాంకేతికతతో గుర్తింపు..బాధితుడికి ఫోన్ అప్పగింత
*తెలంగాణ హసన్‌పర్తి,సెప్టెంబర్ 11* తిరుపతిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ సాంకేతికత సాయంతో హసన్‌పర్తి పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు.వివరాల ప్రకారం..మే 30న ఎన్.ప్రశాంత్ తన మొబైల్ ఫోన్‌ను తిరుపతిలో పోగొట్టుకున్నాడు.దీనిపై హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ సీఈఐఆర్ ఆపరేటర్ ఎం.సోమన్న,క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ కె.తిరుపతి సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో మొబైల్ ఫోన్ తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.దీంతో క్రైమ్ పార్టీ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని ఫోన్‌ను కొరియర్ ద్వారా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తెప్పించారు.అనంతరం ఇన్‌స్పెక్టర్ ఎ.మహేందర్ శుక్రవారం బాధితుడు ప్రశాంత్‌కు మొబైల్‌ను అప్పగించారు.ఫోన్‌ను రికవరీ చేసిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.