EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నవభారత నిర్మాణంలో యువ శక్తి

    నవభారత నిర్మాణంలో యువ శక్తి

    పావన నవ జీవన బృందావన నిర్మాతలు, రేపటి యుగానికి దూతలు యువతరం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే అందులో ఉండే యువత శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన ప్రతిభాపాటవాల మీదనే ఆధారపడి ఉంటుంది.
    యువత అంటే కేవలం వయసులో ఉండే ఒక మైలురాయి కాదు అదొక చేతనా తరంగం, సమాజ దిశను మార్చే విప్లవ జ్వాల. కాలపు పుటల్లో నూతన అధ్యాయాలను లిఖించే అపరిమిత శక్తుల అక్షయపాత్ర ప్రతి యువ హృదయం. చీకట్లను చీల్చుకుంటూ వచ్చే ప్రభాత భానుడి వెలుగులా, నిశ్శబ్దాన్ని ఛేదించే క్రాంతి గర్జనలా యువతరం అడుగులు వేస్తోంది. రేపటి ఆశల సౌధానికి నేటి పునాది రాయి యువశక్తి. ప్రపంచం ఒక గొప్ప మార్పు కోసం నిరీక్షిస్తున్న వేళ, "నేనున్నాను" అంటూ సాహసంతో ముందుకురికే నైజమే యువతరం.ప్రపంచ చరిత్రను తిరగరాసిన మహత్తర విప్లవాల వెనుక, శాస్త్ర సాంకేతిక రంగాలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆవిష్కరణల వెనుక నిలిచింది యువశక్తే. ప్రతి ఆలోచనలో ఒక నవ ఆవిష్కరణ, ప్రతి స్వప్నంలో ఒక విభావరి, ప్రతి సంకల్పంలో ఒక నవ సమాజపు ఆకాంక్ష నిండి ఉన్న తరుణమిది. అంతర్జాతీయ యువజన దినోత్సవం మనకిచ్చే అమూల్య సందేశం ఒక్కటే. "నువ్వు కేవలం భవిష్యత్తుకు ప్రతినిధివి మాత్రమే కాదు, వర్తమానానికి నిర్దేశకుడివి" ప్రపంచ ప్రగతి చక్రాలకు ఇంధనం నీ ఆలోచనలే, శాంతిసౌభాగ్యాల భవితకు పునాది నీ నమ్మకమే. నీలోని శక్తిని గుర్తించు, సవాళ్లను అధిగమించు, స్వప్నాలను ఆచరణలోకి తేవడానికి పునరంకితమవ్వు.
    నేపథ్యం- చరిత్ర:
    యువతను కేవలం రేపటి పౌరులుగా చూడటమే కాకుండా, "నేటి మార్పునకు రథసారథులుగా" గుర్తించాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి ఈ రోజును ఏర్పాటు చేసింది.1998లో పోర్చుగల్ లోని లిస్బన్ నగరంలో జరిగిన 'వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యూత్' సమావేశంలో ఆగస్టు 12ను అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ డిసెంబర్ 17, 1999న అధికారికంగా ఆమోదించింది.ప్రపంచవ్యాప్తంగామొదటిసారిగా ఆగస్టు 12, 2000న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.

    సంశయాల కటిక చీకటిని ఛేదించే సంకల్ప జ్వాల
    నేటి యువతరం భయాల నిశ్శబ్దంలో మునిగిపోకూడదు. సంశయాల, నిరాశల కటిక చీకటిలో తమ సృజనాత్మక కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎదురొచ్చే తుఫానులను చూసి భయపడి వెనకడుగు వేయడం యువత నైజం కానే కాదు. ఆ తుఫానులకంటే వేగంగా దూసుకెళ్తూ, వాటి దిశను తలకిందులు చేసే ధీరత్వమే యువత్వానికి అసలైన నిర్వచనం. పర్వతాలను పిండి చేసే సమయం రాని... లక్ష కష్టాలు ఒకేసారి రానీ..ఆ కాలయముడే నీ ముందుకొచ్చి నిలబడనీ... ఓ యువతా అదరకు, బెదరకు, చెదరకు... నీ దగ్గర అద్భుతమైన ఆయుధం ఉంది. అదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.ఓ యువకుడా.. ఓ యువతీ.. నీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపు. నీ అడుగులు పడే ప్రతి చోటా స్వార్థం తొలిగి, స్వచ్ఛమైన మార్గం సుగమం కావాలి. నీ మస్తిష్కంలో రూపుదిద్దుకునే ప్రతి ఆలోచన నవ సమాజ స్థాపనకు పునాది రాయి కావాలి. ఓటములు నిన్ను ఆపే అవరోధాలు కావు, అవి నిన్ను పుటం పెట్టి మెరిపించే అనుభవాల కసూర్తులు మాత్రమే. నీ సంకల్పం ముందు ఏ పర్వతమూ ఎత్తు కాదు, నీ పట్టుదల ముందు ఏ సముద్రమూ దాటలేనిది కాదు.
    సాంకేతిక పరిజ్ఞానం- మానవీయ విలువల మహా సంగమం: మనం జీవిస్తున్న ఈ ఆధునిక యుగంలో, సాంకేతికత అనూహ్యమైన వేగంతో పురోగమిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధనలు, గ్రీన్ టెక్నాలజీ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు నేడు యువత చేతుల్లో శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. అయితే, సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎత్తుకు ఎదిగినా, నీ హృదయంలో మానవీయత అనే దివ్యజ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉండాలి..
    లేవండి... నవ ప్రపంచాన్ని నిర్మించండి
    కాలం వేగంగా కరిగిపోతోంది. లభించిన ప్రతి క్షణం శతాబ్దమంత విలువైనది. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవ వేళ, నిశ్చలమైన ప్రగతి పథంలో పయనిస్తానని నీ గుండెలపై చెయ్యి వేసి ప్రమాణం చేయి. అలసత్వానికి చోటివ్వకు, అజ్ఞానానికి తలవంచకు. సవాళ్లను నీ ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకో. ఆకాశంలో కమ్మేసిన నల్లని మబ్బులు ఎంత గాఢంగా ఉన్నా, ఒక్క చిన్న సూర్యకిరణం దాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తుంది; అలాగే లోకంలో ఎంత నిరాశ ఆవరించి ఉన్నా, నీలోని ఒక్క దృఢ సంకల్పం వేల హృదయాల్లో ఆశాజ్యోతిని వెలిగిస్తుంది.
    యుగపురుషుడు స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాన్ని నీ ప్రతి శ్వాసలో నింపుకో. "లేవండి...మేల్కొనండి..గమ్యం చేరే వరకు విశ్రమించకండి."
    నీ ఆలోచనల పరిమళంతో ఈ ప్రపంచం సువాసనలు వెదజల్లాలి, నీ మార్గదర్శకత్వంలో సమసమాజ స్వప్నం సాకారమవ్వాలి. నీ సాధనతో రాబోయే తరాలకు నువ్వొక రోల్ మోడల్‌గా నిలవాలి. నీ అడుగుల చప్పుడుకు కాలమే సమాధానం చెప్పాలి.
    యువ భారతం: భారతదేశంలో 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల యువత సంఖ్య సుమారు 37.1 కోట్లు (371 మిలియన్లు). ఇది దేశ మొత్తం జనాభాలో సుమారు 27.2% భాగం. భారత సగటు వయస్సు కేవలం 28-29 సంవత్సరాలు కాగా, చైనా, అమెరికా, ఐరోపా దేశాలు వేగంగా వృద్ధాప్యం వైపు పయనిస్తున్నాయి.
    భారతీయ యువ కార్మిక శక్తిలో దాదాపు 45% వ్యవసాయ రంగాన్ని నమ్ముకోగా, 28.9% సేవా రంగంలో మరియు మిగిలిన వారు తయారీ, నిర్మాణ రంగాలలో పనిచేస్తున్నారు.
    ఈ "డెమోగ్రాఫిక్ డివిడెండ్" రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారతదేశానికి లభించే అతిపెద్ద వరం. దీనిని సరిగ్గా వినియోగించుకుంటే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారడం తథ్యం.

    యువతరం అంటే ముగిసే అధ్యాయం కాదు, ఉదయించే నవ శకానికి అరుణోదయం. నీలోని ఆలోచనా విత్తనమే రేపటి మహా వటవృక్షం.నీ గుండెచప్పుడులో మ్రోగే లయభాగమే నవ సమాజపు విజయ దుందుభి. కాలపు కాన్వాస్‌పై నీ ఆశయాల రంగులతో ఒక అద్భుత చిత్రాన్ని గీయడానికి, సమాజపు గమనానికి ఒక సరికొత్త దిశను నిర్దేశించడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం. అడ్డంకులు నీ అడుగులను ఆపలేవు.నీలోని ఆత్మవిశ్వాసం ముందు ఏ సవాలైనా తలవంచాల్సిందే.
    స్వప్నాల వీధిలో కేవలం బాటసారిగా మిగిలిపోకు, ప్రతి మార్పుకీ నాంది పలికే యుగకర్తవు కా. చరిత్ర పుటల్లో నిలిచిపోయే శతాబ్దపు శక్తీ, సాక్ష్యమూ నువ్వే. నిరాశల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ప్రగతి భానుడి వెలుగులను నలుదిశలా విరజిమ్ము. సంకల్పం నీ ఆయుధమైతే, నిరంతర శ్రమ నీ ఇంధనమైతే జగత్తు నీ జయకేతనానికి శిరస్సు వంచుతుంది. రేపటి చరిత్ర నీ అడుగుజాడలను బంగారు అక్షరాలతో లిఖించేలా... లే, కదులు, విజయం నీదే.నీ ఆశయాల వెలుగులోనే నవ భారతం, నవ ప్రపంచం నడవాలి.విజయీభవ యువశక్తి. జై నవభారత్.
    వ్యాసకర్త :
    పోగు అశోక్
    సైకాలజిస్ట్ & మోటివేషనల్ స్పీకర్.

    ఇవి కూడా చదవండి