EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

    ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

    ములుగు, ఆగస్టు 16: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అనంతరం గట్టమ్మ ఆలయం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల (HAM Roads) పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. గ్రామీణ రహదారుల సదుపాయాలు పటిష్టం కావడంతో ప్రజల రాకపోకలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరనుంది. తదుపరి ములుగు జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన నూతన సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావును కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.868 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    ములుగు పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.