EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాఠాలు చెప్పిన టీచర్‌నే హతమార్చిన విద్యార్థులు

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Aug 2026, 06:10 PM | Technology, TELANGANA, తెలంగాణ, నల్గొండ
    పాఠాలు చెప్పిన టీచర్‌నే హతమార్చిన విద్యార్థులు

    కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు.

    దోపిడీ కోసం ప్రిన్సిపల్‌ను దారుణంగా హత్య చేసిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాస్త్రీయ దర్యాప్తు, సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక విశ్లేషణతో పోలీసులు కేసును ఛేదించారు.

    ‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన మర్డర్ మిస్టరీ!

    హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో చివరిగా “బాబు” అని పలికారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఈ ఒక్క మాట పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.

    రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా “బాబు” అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు.

    పాఠశాల పునఃప్రారంభమైన అనంతరం విద్యార్థులను ఒక్కొక్కరిని విచారించారు. ఈ క్రమంలో పాఠశాలకు వరుసగా రెండు రోజులుగా హాజరుకాని కొందరు విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

    70 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన

    హత్య జరిగిన ప్రాంతంతో పాటు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు రాత్రింబవళ్లు విశ్లేషించారు.

    మొత్తం ఐదు ప్రత్యేక బృందాల్లో సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.

    రూ.1.54 లక్షల నగదు స్వాధీనం

    ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో దొనియాల X రోడ్ వద్ద ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

    తనిఖీల్లో వారి వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదు లభించింది. అందులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

    విచారణలో ఈ నగదు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అనంతరం అపహరించినదిగా పోలీసులు తెలిపారు.

    హత్యకు పక్కా స్కెచ్!

    ఇద్దరు విద్యార్థులు ఒకే హాస్టల్ గదిలో ఉంటూ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో డబ్బు సులభంగా సంపాదించే మార్గాల కోసం వెతికినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    గత నెలలో హాస్టల్‌లో డబ్బుల విషయంలో ప్రిన్సిపల్ వారికి మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించిన విద్యార్థులు ముందుగా రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.

    కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసి దాడి

    హత్య జరిగిన రోజు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం ఇద్దరు విద్యార్థులు కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఒకరు నిఘా పెట్టగా, మరొకరు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది.

    ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

    అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.

    కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేసి, కొంత దూరంలో దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    పోలీసులు స్వాధీనం చేసుకున్నవి

    - రూ.1.54 లక్షల నగదు
    - మృతురాలి ఐఫోన్
    - హత్యకు ఉపయోగించిన కత్తి
    - చేతి గ్లౌజులు
    - మాస్కులు
    - రెండు సెల్‌ఫోన్లు

    ఇద్దరు బాలురు పోలీసుల అదుపులో

    JCL-1: 16 సంవత్సరాలు, పదో తరగతి విద్యార్థి
    JCL-2: 16 సంవత్సరాలు, పదో తరగతి విద్యార్థి

    ఇద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌లోనే చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందనలు

    ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ M.V. శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ A. నవీన్ కుమార్, CCS ఇన్‌స్పెక్టర్ M. జితేందర్ రెడ్డి, ఎస్‌ఐలు, CCS సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, IPS అభినందించి రివార్డులు ప్రకటించారు.

    ఎంత తెలివిగా నేరానికి పాల్పడినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాన్ని ఛేదించవచ్చని ఎస్పీ తెలిపారు.

    క్రైమ్ నం. 150/2026 | సెక్షన్ 103 BNS | కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్

    ఎస్ ఎస్ మీడియా – నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు!