EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సాగర్ నీళ్లు మా హక్కు.. వెంటనే ఎడమ కాల్వకు నీరు విడుదల చేయాలి: జగదీష్ రెడ్డి

    సాగర్ నీళ్లు మా హక్కు.. వెంటనే ఎడమ కాల్వకు నీరు విడుదల చేయాలి: జగదీష్ రెడ్డి

    నల్గొండ జిల్లా కేంద్రం: నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపు జరుగుతున్నప్పటికీ తెలంగాణకు చెందిన జిల్లా మంత్రులు స్పందించడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగర్ ఎడమ కాల్వతో పాటు లిఫ్ట్‌లకు కూడా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సాగర్‌లో ప్రస్తుతం 532 అడుగుల నీటి మట్టం ఉందని, సుమారు 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నీటితో ఎడమ కాల్వకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నీటిని విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
    “కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగర్‌లో తక్కువ నీటి నిల్వ ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించాం. వరుసగా 17 సార్లు నీటిని అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. ఎడమ కాల్వ కింద ఉన్న లిఫ్ట్‌లకు కూడా పుష్కలంగా నీటిని అందించాం” అని జగదీష్ రెడ్డి అన్నారు.శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాగర్ ఓవర్‌ఫ్లో అయి సముద్రంలోకి నీరు విడుదల చేసే పరిస్థితుల్లో మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లే నిబంధనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రైతులకు నీరు అవసరమైన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించడం అన్యాయమని ఆరోపించారు.“ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. అక్కడ పంటలు సాగవుతున్నాయి. మరి తెలంగాణ రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వరు? సాగర్ ఆయకట్టు రైతులు నీటికి న్యాయమైన హక్కుదారులు” అని జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టవద్దని, రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.రైతులకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం యాగాల పేరుతో కాలయాపన చేస్తోందని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతులు పంటలు పండిస్తే బోనస్, యూరియా వంటి అంశాల్లో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సాగునీరు ఇవ్వకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు.“సాగర్ నీళ్లు మా హక్కు. వెంటనే ఎడమ కాల్వకు, లిఫ్ట్‌లకు నీటిని విడుదల చేయాలి. లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం” అని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి పార్టీ తరఫున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటిని సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రైతాంగానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, హుజూర్‌నగర్ ఇన్‌చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.