EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యుగయుగాల శ్రీకృష్ణ తత్త్వం: డిజిటల్ యుగానికి దివ్య మార్గదర్శకం!

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 10:44 AM | TELANGANA, వరంగల్
    యుగయుగాల శ్రీకృష్ణ తత్త్వం: డిజిటల్ యుగానికి దివ్య మార్గదర్శకం!

    మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలి వేగంగా మారిపోతోంది. కానీ, శతాబ్దాలు గడిచినా నిత్యనూతనంగా నిలిచే ఒకే ఒక్క మార్గదర్శనం శ్రీకృష్ణ తత్త్వం. సాధారణంగా శ్రీకృష్ణుడు అనగానే పిల్లనగ్రోవి, నెమలి పింఛం, రాధాకృష్ణుల ప్రేమ లేదా కురుక్షేత్ర భగవద్గీత మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. నిజానికి శ్రీకృష్ణావతారం ఒక వ్యక్తి పూజ కాదు.. అదొక సమగ్ర జీవన విజ్ఞానం, సకల శాస్త్రాల సమాహారం.

    సంపూర్ణ శాస్త్రాల సమ్మేళనం
    శ్రీకృష్ణుడు కేవలం పురాణ పురుషుడు మాత్రమే కాదు, గొప్ప ఆచరణవాది. దర్శనం, రాజనీతి, తత్త్వశాస్త్రం, యోగం, భక్తి, జ్ఞానం, మనోవిజ్ఞానం, సమాజహితం వంటి అనేక రంగాల కలయికే ఆయన అవతారం. బాల్యంలో లీలాతత్త్వం, యౌవనంలో భక్తి తత్త్వం, మధురలో ధర్మరక్షణ, ద్వారకలో రాజనీతి, కురుక్షేత్రంలో జ్ఞానబోధ.. ఇలా ఆయన జీవితంలో ప్రతి ఘట్టం మానవాళికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. 125 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో మొదటి 12 ఏళ్లు మాత్రమే బృందావనంలో గడిపిన ఆయన, ఆ తర్వాత చేసిన ప్రతి పని ఒక యుగానికి సరిపడా సందేశాన్ని ఇచ్చింది.

    నేటి తరం మానసిక ఒత్తిడికి ఏకైక ఔషధం
    ఈనాటి 21వ శతాబ్దపు డిజిటల్ జనరేషన్ తీవ్రమైన పోటీ, వర్క్ ప్రెజర్, యాంగ్జైటీ, డిప్రెషన్‌తో సతమతమవుతోంది. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే కురుక్షేత్రంలో అర్జునుడు మానసిక సంఘర్షణతో మోకాళ్లపై కూలిపోయాడు. అప్పుడు అర్జునుడిలోని భయాన్ని పారదోలి, కర్తవ్యాన్ని గుర్తుచేసి ధైర్యాన్ని నూరిపోసిన శ్రీకృష్ణుడే ఈ కాలానికి అతిపెద్ద మెంటల్ హెల్త్ కౌన్సెలర్. సమస్యలు చూసి పారిపోకుండా, వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని ఆయన బోధించాడు.

    శాస్త్రవేత్తగా, విజన్ ఉన్న నాయకుడిగా
    శ్రీకృష్ణుడు మాటలకే పరిమితం కాలేదు. ఆయుర్వేద సంప్రదాయంతో అనుబంధం, గోవర్ధన గిరిని ఎత్తి ప్రకృతి-వర్షం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చూపాడు. సుదర్శన చక్ర ప్రయోగం వెనుక ఉన్న భౌతిక సూత్రాలు, ద్వారక నగరాన్ని నిర్మించిన విధానం చూస్తే ఆయన ఒక గొప్ప సివిల్ ఇంజనీర్, సైంటిస్ట్ అని స్పష్టమవుతుంది. పాండవుల తరఫున రాయబారిగా వెళ్లి యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నించి గొప్ప క్రైసిస్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

    కార్పొరేట్ రంగానికి దిక్సూచి: కర్మ సిద్ధాంతం
    సోషల్ మీడియా యుగంలో తక్షణ ఫలితాల కోసం తపించే నేటి కార్పొరేట్ ప్రపంచానికి శ్రీకృష్ణుడి బోధన ఒక అద్భుతమైన దిక్సూచి. "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" అంటే ఫలితంపై ఆశ లేకుండా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు అని చెప్పాడు. లైక్‌లు, వ్యూస్, ప్రమోషన్ల టెన్షన్‌లో పడి పనిని ఆస్వాదించడం మర్చిపోతున్న ఈ తారతమ్యాల కాలంలో చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టమన్న ఆయన మాట మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
    శ్రీకృష్ణ తత్త్వం గుళ్లలోని ధూపదీప నైవేద్యాలకే పరిమితం కాకూడదు. మనిషి ఎలా ఆలోచించాలి? ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి? ఒత్తిడిని జయించి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? అనే ప్రశ్నలకు దొరికే ఉత్తమ సమాధానం శ్రీకృష్ణుడి జీవితం. ఆ తత్త్వాన్ని అర్థం చేసుకుని ఆచరించడమే మన జీవితానికి నిజమైన అర్ధం.