EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రం ప్రారంభం

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 03:09 PM | TELANGANA, వరంగల్
    వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రం ప్రారంభం

    మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మద్యం, పొగాకు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వ్యసనం నేడు యువతతో పాటు వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సామాజిక సమస్యగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాలపై డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అదే సమయంలో మత్తు పదార్థాలకు బానిసలైన యువతను శిక్షించడం మాత్రమే కాకుండా, వారిని వ్యసన విముక్తి చేసి తిరిగి ఆరోగ్యకరమైన జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, జి.ఓ. ఎం.ఎస్. నెం.4, తేదీ 10-02-2026 ప్రకారం ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయబడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ చొరవతో, ఎంజీఎం ఆసుపత్రి అధికారులు మరియు సిబ్బంది సహకారంతో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రాన్ని మరింత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం జరిగింది. కేంద్రంలో ప్రత్యేక అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) వార్డు ఏర్పాటు చేసి పడకల సామర్థ్యాన్ని 10 నుంచి 20 కు పెంచడం జరిగింది. రోగుల భద్రత కోసం ఇనుప గ్రిల్స్, సీసీటీవీ నిఘా మరియు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.బాధితుల మానసిక ప్రశాంతత కోసం క్యారమ్ బోర్డు, చెస్ వంటి వినోద సౌకర్యాలను కూడా కల్పించారు.అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో బాధితులకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ మరియు అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) సేవలు అందించబడతాయి. మత్తుకు బానిసైన యువతను తిరిగి సాధారణ, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.తమ పిల్లలు లేదా కుటుంబ సభ్యులు మత్తు పదార్థాలకు బానిసలైనట్లు గుర్తించిన తల్లిదండ్రులు ఆ సమస్యను దాచిపెట్టకుండా వెంటనే సహాయం పొందాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేస్తోంది. సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల సహకారం ద్వారా మత్తు బానిసత్వం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. డీ-అడిక్షన్ చికిత్స అవసరమైన వారు ఎంజీఎం ఆసుపత్రిలోని కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన సేవలను పొందవచ్చు.
    అవసరమైన సహాయం కోసం సమీప పోలీస్ స్టేషన్ అధికారులను, ఎంజీఎం మానసిక వైద్య సిబ్బందిని కూడా సంప్రదించవచ్చు .
    “మత్తును వదిలి – జీవితాన్ని ఎంచుకోండి.”
    “వ్యసనాన్ని దాచకండి – సహాయం పొందండి.”
    “చికిత్స ఒక జీవితాన్ని మార్చగలదు.”
    మత్తు పదార్థాల వ్యసనానికి సంబంధించిన ఏదైనా సహాయం, సమాచారం లేదా మార్గదర్శకత్వం కోసం 87125 84473/87126 85299 సంప్రదించండి.

    ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఎస్. బి యం. జి. యం సూపరింటెండెంట్ డా. రాంరెడ్డి, ఆర్.యం.ఓ అశ్వని కుమార్, ఎస్. బి ఇంచార్జి ఏసీపీ మధుసూదన్, డ్రగ్స్ కంట్రోల్ టీం ఇన్స్ స్పెక్టర్ సాయి రాం, ఆర్.ఐ శివ కేశవులు, ఈగల్ టీం ఇన్స్ స్పెక్టర్ రవీందర్, ఎస్. ఐ శ్రీకాంత్,ఆర్. ఎస్. ఐలు పూర్ణ చందర్ రెడ్డి,మనోజ్ రెడ్డి, నాగరాజు, పోలీస్ మరియు యం.జి.యం హాస్పటల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.