EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 06 Sep 2026, 07:29 PM | వరంగల్
    వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి

    రౌడీషీటర్లకు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ హెచ్చరిక

    వరంగల్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ రౌడీషీటర్లను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. పండుగ సందర్భంగా గణేష్‌ మండపాల ఏర్పాటు, ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, నిమజ్జనం కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేదా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని రౌడీషీటర్లను హెచ్చరించారు.

    ముఖ్యంగా పాత నేర చరిత్ర ఉన్న వ్యక్తులు పోలీసుల నిఘాలో ఉంటారని, పండుగను ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, గొడవలకు దిగినా లేదా ఇతరులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

    ఇవి కూడా చదవండి

    అదేవిధంగా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో హంగామా చేయడం, యువతను రెచ్చగొట్టడం, గణేష్‌ మండపాల వద్ద గొడవలకు పాల్పడటం, ఊరేగింపుల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని సూచించారు.

    గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా, పోలీసుల సూచనలు మరియు నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

    పండుగ సందర్భంగా పోలీస్‌ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    వినాయక చవితి మరియు నిమజ్జనం కార్యక్రమాలను ప్రజలందరూ శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖకు సహకరించాలని ఇన్‌స్పెక్టర్‌ మంగీలాల్‌ కోరారు.