EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘బృందావనమాలి’

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Sep 2026, 05:40 PM | TELANGANA, వరంగల్
    రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘బృందావనమాలి’

    మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలనే సంకల్పంతో గత 30 సంవత్సరాలుగా కళాసేవ, సమాజసేవలో అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్న రోజా క్రియేషన్స్, వరంగల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ‘బృందావనమాలి’ పేరిట ఆదివారం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కమ్యూనిటీ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.

    రోజా క్రియేషన్స్ అధినేత, కార్యక్రమ దర్శకులు ఆలేటి శ్యామ్ సుందర్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తి, సంగీతం, నృత్యం, కళల అపూర్వ సమ్మేళనంగా సాగాయి. మూడు దశాబ్దాలుగా కళాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభకు వేదిక కల్పిస్తూ, మరుగున పడుతున్న కళారూపాలకు జీవం పోస్తూ రోజా క్రియేషన్స్ వరంగల్ సాంస్కృతిక రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది.

    ఈ వేడుకల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త గట్టు మహేష్ బాబు, ఏసీపీ విజయ్ కుమార్, డా. జగదీశ్వర్ ప్రసాద్, సీనియర్ ఆర్టిస్ట్ చంద్రమౌళి, డా. శంకు హరినాథరావు కుటుంబ సభ్యులు, రావెళ్ల రామారావు, డా. రోషన్, బహుభాషా కవి, రచయిత బిటవరం శ్రీమన్నారాయణ, ఆదర్శ లా కళాశాల అధినేత బూర విద్యాసాగర్, అంతర్జాతీయ ఫొటో అవార్డు గ్రహీత అనిల్, ప్రముఖ మెజీషియన్ కళ్యాణ్, మారడోజు సదానందాచారి, టయ్యాల శ్రీధరాచారి, పులి గణేష్, గాయకుడు మధు, చందు తదితరులు పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    ఇవి కూడా చదవండి

    మహిళా ప్రముఖుల్లో లయన్ డా. పద్మజ, లయన్ పొన్నాల సంయుక్త, బల్జపల్లి నాగరత్నం, దేవాదాయ శాఖ వరంగల్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. కవిత, ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ యాకలక్ష్మి, గాయని స్వప్న, కీబోర్డ్ కళాకారిణి స్వప్న, యాంకర్ హిమబిందు, జానపద నృత్య గురువు రాజలక్ష్మి, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి, ప్రొఫెసర్ డా. సాగంటి మంజుల, యాంకర్ శ్రావంతి తదితరులు పాల్గొన్నారు.

    మయూరి నాట్యక్షేత్రం గురువు వర్షిణి, శీలం మ్యూజిక్ అకాడమీ గురువు శీలం సుమతి, హరిత కృష్ణ కూచిపూడి నృత్య కళాక్షేత్రం గురువు హరిత గుంటోజు ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. బాలల అడుగుల్లో కృష్ణలీలలు కనువిందు చేయగా, సంగీత స్వరాలు ప్రాంగణమంతా భక్తి పరిమళాలను వెదజల్లాయి.

    కళ కేవలం వినోదం కాదని, అది మన సంస్కృతికి చిరునామా, తరతరాలను కలిపే వారధి అనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. కళాకారులను గౌరవించడం, కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం, మన సంప్రదాయాలపై చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా రోజా క్రియేషన్స్ చేస్తున్న నిరంతర కృషి ఈ సందర్భంగా ప్రతిబింబించింది.

    ముఖ్యంగా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎన్. కవిత శ్రీకృష్ణుని వేషధారణలో, ప్రొఫెసర్ డా. సాగంటి మంజుల రాధ వేషధారణలో వేదికపై దర్శనమివ్వడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధాకృష్ణుల రూపంలో వారి సుందర వేషధారణ, బాలల నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కమ్యూనిటీ హాల్ ప్రాంగణం బృందావనాన్ని తలపిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అపూర్వ శోభను తీసుకొచ్చింది.