EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 09:55 PM | TELANGANA, వరంగల్
    గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి

    *ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు*
    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి మహోన్నత విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా సత్యం, ధర్మం, నైతిక విలువలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

    భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పాత్ర అత్యంత కీలకమైనదని, దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాలకు చెందిన ప్రజలను ఒకే లక్ష్యం వైపు నడిపిస్తూ స్వాతంత్ర్య సమరాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారని తెలిపారు. సామాన్య ప్రజలు సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములు కావడానికి గాంధీజీ నాయకత్వం ఎంతో దోహదపడిందని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    గాంధీజీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, పరిశుభ్రత, స్వావలంబన, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యంగా యువత గాంధీజీ జీవితాన్ని, ఆయన ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    నేటి తరానికి గాంధీజీ ఆశయాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఆచరణలో పెట్టేలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గాంధీజీకి విగ్రహాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, ఆయన చూపిన సత్యం, అహింస, మానవత్వం, సేవా భావం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు పేర్కొన్నారు.

    పర్వతగిరి మండల కేంద్రంలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేసిన అభ్యుదయ సంఘం సభ్యులను సన్మానించి అభినందించారు , ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు గాంధీజీ ఆశయాలను గుర్తుచేసేలా నిలవాలని ఆకాంక్షించారు. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రజలందరూ శాంతి, సోదరభావం, ఐక్యతతో ముందుకు సాగాలని ఆమె కోరారు.

    ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సీనియర్ నాయకులు యూత్ మరియు సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.