EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళల భద్రతపై పద్మావతి కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Oct 2026, 10:58 PM | TELANGANA, వరంగల్
    మహిళల భద్రతపై పద్మావతి కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు

    టీ-సేఫ్ యాప్ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించిన ఎస్సై రామారావు

    వరంగల్: మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, టీ-సేఫ్ యాప్ వినియోగంపై వరంగల్‌లోని పద్మావతి కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు మాట్లాడుతూ.. నేరాలు, అఘాయిత్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాల వంటి నేరాల పట్ల విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని కోరారు.

    ఇవి కూడా చదవండి

    సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ తదితర వేదికల్లో వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, ఉద్యోగాలు చేసే మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు, ఆకతాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

    మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని, దాని సేవలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

    సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్‌కు సంబంధించిన వాట్సాప్ నంబర్లకు ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, నేరస్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రామారావు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పద్మావతి కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ డాక్టర్ ఏ. సంపత్, వైస్ ప్రిన్సిపాల్ జనార్ధన్, షీ టీమ్ ఎస్సై రామారావు, సిబ్బంది, కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.