EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్గొండలో రాక్షస రాజ్యం, కమిషన్ల రాజ్యం నడుస్తోంది: కంచర్ల భూపాల్‌రెడ్డి

    నల్గొండలో రాక్షస రాజ్యం, కమిషన్ల రాజ్యం నడుస్తోంది: కంచర్ల భూపాల్‌రెడ్డి

    నల్గొండ: నల్గొండలో ప్రస్తుతం రాక్షస రాజ్యం, కమిషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండతోనే అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.సీపీఎం కార్యాలయంపై పోలీసులు దౌర్జన్యం చేయడం అమానుషమని భూపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీపీఎం నాయకులను అరెస్టు చేసిన ఎస్‌ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై తీవ్ర ఆరోపణలు

    డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో ఇంటికి రూ.3 లక్షల వరకు లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 546 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించామని, స్థానిక డివిజన్‌లో ప్రజల సమక్షంలో డ్రా నిర్వహించి అర్హులకు ఇళ్లు కేటాయించామని చెప్పారు.

    431 ఇళ్లకు అప్పట్లో డ్రా నిర్వహించామని, డ్రాలో పేర్లు వచ్చిన వారికి ఇళ్లు కేటాయించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. డీఈవో కార్యాలయం–దుప్పలపల్లి రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి కూడా హామీ ఇచ్చామని, అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో 130 మంది రోడ్డు బాధితులను ఎంపిక చేశామని వివరించారు. అయితే డ్రాలో పేర్లు వచ్చిన వారిలో సుమారు 150 మందికి కూడా ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.

    ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను కలెక్టర్ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు అప్రజాస్వామికమని, వాటిపై మళ్లీ రీ-వెరిఫికేషన్ చేసి అర్హులకు డ్రా ద్వారా ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

    ఇవి కూడా చదవండి

    డబ్బులు ఇచ్చి ఇళ్లు పొందిన వారు వెంటనే తమ డబ్బులు తిరిగి తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్‌లో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైతే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తాళాలు వేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత కేటాయింపులను రద్దు చేసి మళ్లీ డ్రా నిర్వహిస్తామని అన్నారు.

    ప్రభుత్వ భూములపై ఆరోపణలు

    నల్గొండ పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని భూపాల్‌రెడ్డి ఆరోపించారు. అమృత్ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వెంచర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి అమృత్ పథకం నిధులను వినియోగిస్తున్నారని విమర్శించారు. లతీఫ్‌సాబ్ గుట్టకు బఫర్ జోన్ ఏర్పాటు చేయలేదని, రానున్న రోజుల్లో వెంచర్లపై విజిలెన్స్ విచారణలు నిర్వహిస్తామని తెలిపారు.

    బీఆర్‌ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం పట్టణంలోని పార్కులు శిథిలావస్థకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2040 విజన్‌తో అభివృద్ధి చేయాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి చేసి నెలకు సుమారు 1,000 ప్రసవాలు జరిగే స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల కొరత ఉందని ఆరోపించారు.నల్గొండ యువత భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా సుమారు 3,600 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల నిర్మాణం ఆలస్యం కావడంపైనా ప్రశ్నించారు.పానగల్ ఎల్లమ్మ గుడి నుంచి డీఈవో కార్యాలయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్నించారు. రూ.700 కోట్లతో నిర్మించిన నల్గొండ ఔటర్ రోడ్డులో కమిషన్ల కోసమే పనులు చేపట్టారంటూ ఆరోపించారు.బీఆర్‌ఎస్ హయాంలో నల్గొండకు 24 గంటల నీటి సరఫరా అందించామని భూపాల్‌రెడ్డి తెలిపారు. 2040 నాటికి నల్గొండ జనాభా మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అన్నారు.నల్గొండ రైల్వే అండర్ బ్రిడ్జి డబుల్ వెంటును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ లైన్‌ను 92 కిలోమీటర్ల మేర విస్తరించి, 3,000 క్యూసెక్కుల నీటిని జిల్లాకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.ట్యాంక్‌బండ్, కళాభారతి, పానగల్ దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన నిధులపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులే ప్రస్తుతం అభివృద్ధి పనులుగా కొనసాగుతున్నాయని విమర్శించారు.

    కోమటిరెడ్డికి భూపాల్‌రెడ్డి సవాల్

    నల్గొండకు 30 ఏళ్లుగా అవకాశం పొందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టణానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, మంత్రి కోమటిరెడ్డి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు.మర్రిగూడ ఫ్లైఓవర్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.45 కోట్లతో నిర్మించామని పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని గతంలో కోమటిరెడ్డి ప్రారంభించడంపైనా వ్యాఖ్యలు చేశారు. తనపై డీఎస్పీ ఎందుకు కేసు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.“నల్గొండ ప్రజల కోసం నా ప్రాణాలైనా ఇస్తా.. కేసులకు భయపడను” అని భూపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను ఇందిరా భవన్‌గా మార్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఏసీలను విక్రయించారని ఆరోపణలు చేశారు.డీఎస్పీ శివరాంరెడ్డి తన విధులను మరచి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నల్గొండ మెడికల్ కాలేజీకి రూ.200 కోట్లు తీసుకురావాలని, కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ఇళ్ల పంపిణీ కోసం గతంలో భూమి కేటాయించామని భూపాల్‌రెడ్డి తెలిపారు. వెంటనే జర్నలిస్టులకు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అండగా బీఆర్‌ఎస్, తాను పోరాటం చేస్తామని ప్రకటించారు.నల్గొండలో బీఆర్‌ఎస్ నాయకులపై వివక్షను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
    ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాసరెడ్డి, మారగోని గణేష్, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దొడ్డి రమేష్, జమాల్ ఖాద్రి, మిర్యాల స్వామి, ఊటుకూరు సందీప్‌రెడ్డి, బడుపుల శంకర్, అన్వర్ పాషా, దండంపల్లి సత్తయ్య, గంజి రాజేందర్, పెండెం ధనుంజయ, నర్ర నిర్మల, రాయల రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.