EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సంచార జాతులకు సానుభూతి కాదు.. సమాన గౌరవం, అవకాశాలు కావాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 05:25 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    సంచార జాతులకు సానుభూతి కాదు.. సమాన గౌరవం, అవకాశాలు కావాలి

    విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలి

    వృత్తిదారుల కోసం ‘వర్క్ షెడ్ కమ్ హౌస్’ పథకం ప్రవేశపెట్టాలి

    ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలి: చిప్ప వెంకటేశ్వర్లు నేత

    వరంగల్, ఆగస్టు 31:
    సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల పట్ల కేవలం సానుభూతి చూపించడం కాకుండా, వారికి సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని శ్రమశక్తి అవార్డు గ్రహీత, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత అన్నారు.

    ఆగస్టు 31న పురస్కరించుకుని వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల విముక్తి దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చిప్ప వెంకటేశ్వర్లు నేత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో అమలైన ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ కారణంగా అనేక సంచార జాతులు తీవ్ర అణచివేత, వివక్షకు గురై నేరస్థులుగా ముద్ర వేయబడ్డాయని గుర్తుచేశారు. స్వతంత్ర భారతదేశంలో ఆ చట్టాన్ని రద్దు చేసి ఈ జాతులను ఆ ముద్ర నుంచి విముక్తులను చేసిన చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఆగస్టు 31న విముక్తి దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.

    “సంచార జాతులకు కావాల్సింది సానుభూతి కాదు.. సమాజంలో గౌరవంగా జీవించే హక్కు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది” అని వెంకటేశ్వర్లు నేత పేర్కొన్నారు.

    తరతరాలుగా సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల వృత్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. వృత్తిదారులకు పక్కా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ‘వర్క్ షెడ్ కమ్ హౌస్’ పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ఒకే ప్రదేశంలో నివాసం, వృత్తి నిర్వహణకు అవసరమైన సదుపాయం కల్పిస్తే వేలాది వృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.

    అలాగే సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రతి నెల ఒక రోజు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

    Denotified, Nomadic and Semi-Nomadic Tribes (DNT, NT & SNT) వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక గుర్తింపు, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన కోసం సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరినప్పుడే సామాజిక న్యాయం సార్థకమవుతుందని అన్నారు.

    ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ కుల సంఘాల నాయకులు, మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ప్రతినిధులు, సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.